Thursday, August 9, 2007

అది సరే ... తోక ఎక్కడ !

గమనిక: హాస్యం పేరుతో దీనిలో మరీ ఎక్కువ మసాలా దట్టించి కథలా చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టడం కంటే జరిగిన సంఘటనను ఎక్కువ మార్పులు చెయ్యకుండా చెప్పడమే మంచిదనిపించి అలానే వ్రాస్తున్నాను.

చాలా కాలం తర్వాత కొంతమంది స్నేహితులు కలవాలని నిశ్చయించుకుని హైదరాబాదులో ఒక స్నేహితుడి ఇంటిలో కలవాలనుకున్నాం.
అనుకోవడమంటే మన చేతుల్లో ఉందిగానీ ..అందరూ వస్తారని చెప్పలేం కదా ..
పనుల ఒత్తిడి వల్ల సంబంధ బాంధవ్యాలు పట్టించుకోవడానికి కుదరని ఈ రోజుల్లో అందరూ వీలు చేసుకుని రాగలరనుకోలేం కదా!

ఇండియాలో ఉండి , కలవాలనే ఆసక్తి ఉండి సమయం కేటాయించగలం అనుకున్నవాళ్ళు కొంతమంది కలిశాం.
గత స్మృతులను నెమరు వేసుకుని ఆనందంగా సమయం గడుపుతుండగా .. నాకు వచ్చిన ఒక తుంటరి ఆలోచన అమలుపరచడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను.
అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలను పిలిచి వాళ్ళ చెవిలో ఒక విషయం చెప్పాను.
నేనూ ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి .. నా స్నేహితులు సతీష్ ని , కోటిని అక్కడికి రమ్మని పిలిచాను.
వాళ్ళు వచ్చిన తర్వాత ..ఆ ఇద్దరు పిల్లలు కోటి దగ్గరకు వెళ్ళి ..నేను చెవిలో చెప్పిన పని చేశారు!.
పిల్లలు : "కోటి అంకుల్ , కోటి అంకుల్ .. మీ తోక మాకు చూపించరా " .. అని అడిగారు..

అప్పుడు కోటిగాడు నవ్వాలో , కోప్పడాలో తెలియని పరిస్థితులలో నావైపు , సతీష్ వైపు చూశాడు.
మా ఇద్దరికీ నవ్వొస్తుంది .. కానీ నవ్వితే ఫీలవుతాడేమో అని కష్టపడి ఆపుకుంటున్నాం..
ఒకప్పుడైతే స్పోర్టివ్ గా ఉండేవాడు ..
వయసు తెచ్చిన మార్పులలో భాగంగా ఇప్పుడు ఎలా ఉంటాడో అని తెలుసుకోవడానికి నేను నడిపించిన నాటకం ఎలాంటి పర్యావసానాలు తీసుకొస్తుందో అని ఆలోచిస్తున్నాను.
"నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష" అని తప్పించుకోవచ్చు.
ఎందుకంటే ఇలాంటి అవుడియా ఇచ్చింది వాడేమరి !
వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడితే ఎలా స్పందిస్తాడో చూడాలనే కదా ఇంత రచన చేసింది!

ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఊహలకు ఎర్ర జెండా చూపించి.. ప్రస్తుతానికి వచ్చాను.
ఇప్పటి వరకూ కోటి గాడు ఇచ్చిన అవుడియా గురించి ఆలోచిస్తూ భవిష్యత్తులో అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించాను.
నేను అలా చేస్తాననే నమ్మకం లేదు .. కానీ ఊహా విహారం మనచేతుల్లోనే ఉంది కదా.

ఇలా ఊహించడానికి నన్ను ప్రేరేపించిన గత సంభాషణ :
------------------------------------------------
దాదాపు సంవత్సరం తర్వాత జూన్ నెల చివర్లో కోటి అనే నా స్నేహితుడికి ఫోన్ చేశాను.
అంటే సతీష్ తో మాట్లాడుతూ ఉండగా కోటిగాడి ప్రస్తావన వచ్చింది.
నేను లైన్లో ఉన్నానని చెప్పకుండా మాట్లాడమని చెప్పాను సతీష్ తో ..
వెంటనే కోటిగాడికి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టాను.

కుశల ప్రశ్నలు అయిన తర్వాత కోటిగాడు నా గురించి అడిగాడు ..
దానికి సతీష్ పోయినవారం కలిసాం ..బాగానే ఉన్నాడు అని చెప్పాడు.
అప్పుడు కోటి గాడు ..కొంతమంది పేర్లు చెప్తూ ..రాజశేఖర్ గాడు (నేనే ) వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు నాకెందుకు చెయ్యడో తెలియదు అంటూ నిష్టూరంగా మాట్లాడుతూ సర్వసాధారణంగా స్నేహితుల్ని తిట్టే శైలిలో (దొంగ నాయాల లాంటివి ) తిట్టడం మొదలుపెట్టాడు.
నేను పక్కన ఉన్నవాళ్ళతో మాట్లాడుతుంటే నేను లైన్లో ఉన్నానని పసిగట్టి తెలిసే అలా మాట్లాడుతున్నాడో .. లేక తెలియక తిడుతున్నా
డో .. నాకైతే అర్ధం కాలేదు.
నేను ఏదొకటి మాట్లాడకపోతే ఇంకేం వినాల్సొస్తుందో అనిపించింది.

నా పక్కన ఒక చిన్న బాబు ఉంటే వాడిని పిలిచి "కోతి అనమ్మా " అన్నాను.
ఆ బాబుకి ఇంకా మాటలు సరిగా రావు .. మొత్తం మీద ఏదోలా అన్నాడు.
ఆ మాటలు విన్న కోటిగాడు ...
అరే .. మీరు చిన్న పిల్లగాళ్ళచేత కూడా కోతి అనిపిస్తున్నారు.
కొన్నేళ్ళ తర్వాత మనం ఎప్పుడైనా బజార్లో కలిస్తే మీ పిల్లలచేత " అంకుల్ , అంకుల్ మీ తోక చూపించండి... " అనిపిస్తారేమో ..
ఒకవేళ చూపించేదాకా వదలొద్దని మీరు వాళ్ళకు చెప్తే ..నేనేం చెప్పినా వినకుండా..
"అది సరే ..తోక చూపించండి" అంటూ వాళ్ళు నా వెంటబడితే నేను అక్కడినుంచి పరిగెత్తాలేమో అన్నాడు.

అదంతా వాడు సరదాకి చెప్పినా ..సందర్భోచితంగా ఉండడం వల్ల మాకు బాగా నవ్వొచ్చింది.
నవ్వే కార్యక్రమం ముగిసిన తర్వాత ..భలే అవుడియా ఇచ్చావు మామా .. కాచుకో మరి ..ఎప్పుడు ఎవరి పిల్లలు "అంకుల్ ..తోకెక్కడ" అంటారో అన్నాను.

దానికి కోటిగాడు : అవునురా!, మీరు అంతటివాళ్ళే నిజంగానే అలా అనిపించినా అనిపిస్తారు అన్నాడు.
మళ్ళీ నవ్వుకుని ఇంక ప్రస్తావనకి ముగింపు పలికి , కాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం.

**********************************
ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు చేత తోకెక్కడ అని అడిగించడమేంటో .. అనుకుంటూ ఈ టపా మొదలుపెట్టాను.:)

Tuesday, August 7, 2007

విస్మరించిన ప్రాథమిక సూత్రం...

యాధృచ్చికంగా తెవికీ లో ఐదు మూలస్తంభాలు పేజీ (పుట )చదువుతుంటే ..
నిన్నటి నా టపాలో తెవికీలో భాగం పంచుకోవాలన్న అత్యుత్సాహంతో ...
తోటి సభ్యులను "ప్రోత్సహించకపోయినా పర్వాలేదు... కానీ నిరుత్సాహపరచకూడదు " అనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయాననిపించింది.

అంతర్జాలంలో తెలుగు భాష , దాని వాడకాన్ని విస్తరింపజేయాలనే సదుద్దేశ్యంతో ఎంతో మంది కృషి చేస్తున్నారు.
నేను కేవలం ఒక్కరి పేరునే ఉదహరించి తప్పు చేశాననిపించింది.
ఎక్కువ ఆలోచించి భుజాలు తడుముకున్నానేమో అనిపించినా ....
చిన్న సవరణ ద్వారా తప్పును సరిదిద్దుకోవాలని ఇది వ్రాస్తున్నాను.

రాజు గారి రెండో భార్య మంచిది అని చెప్పి వదిలేస్తే వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పినట్టు కాదు అని అంటుంటారు కదా ..
(ఈ సందర్భంలో ఇది సరిపోతుందో లేదో ..)

నవీన్ నాకు వ్యక్తిగతంగా పరిచయస్తుడు కావడం వల్ల వాడిని ఆదర్శం /ప్రేరణగా తీసుకుని తెవికీలో వ్రాయాలనుకున్నానే తప్ప వేరేవారెవరినీ తక్కువ చెయ్యడం నా అభిమతం కాదని తెలియజేస్తున్నాను.
ఇప్పుడు కూడా నాకు తెలిసిన కొందరి పేర్లు మాత్రమే వ్రాసి మళ్ళీ తప్పు చెయ్యకూడదని ఎవరి పేరూ వ్రాయడంలేదు.

తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న వారందరికీ వందనాలు , అభినందన చందనాలు.
అనాలోచితంగా చేసిన పొరపాటుకు క్షంతవ్యుడను. (ఇది తెలుగు పదం అనుకోవచ్చా ?)

Monday, August 6, 2007

నేను ఆంధ్రుణ్ణి కాబట్టేనా !!

ఎప్పుడో జూన్ మొదటివారంలో నా బ్లాగులో శాచూ రాసి అని ఏవేవో పిచ్చిరాతలు వ్రాశాను.
జూన్ నెల అయిపోయి , జులై కూడా వచ్చి పోయింది ..కానీ నా బ్లాగులో కొత్త టపాలేవీ లేవు.
ఆంధ్రులు ఆరంభశూరులు అంటారు .. నేనూ అంతేనా ? అందుకే కొత్తవేవీ వ్రాయలేదా .. ఏమో .. ఒక రకంగా ఆలోచిస్తే అది సరి కాదనిపిస్తుంది!.

ఎందుకంటే నేను జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఒక్కటి కూడా వ్రాయలేదు.
రచయితకు , విమర్శకుడికి కూడా అజ్ఞాతం అవసరం అని కొంతమంది అంటుంటారు కదా ..
దాని ప్రభావం నాపై ఉందా ?

దాని సంగతి ఎలా ఉన్నా ..మంచి వ్యాసాలు మాత్రమే వ్రాద్దామనిపించి , అలాంటి మంచి విషయం దొరక్కపోవడం వల్ల వ్రాయడం లేదా ?
అంటే రాశి కంటే వాశి ముఖ్యమని రాయట్లేదా .. ఇది కొంతవరకు కరక్టే అనిపిస్తుంది.


నేనూ తెలుగుబ్లాగు (గుంపు )లో చేరాను!మీరూ లేఖిని తో శక్తిమంత్రం జపించి తెలుగు సాహిత్యం కోసం కూడలికి వస్తారు కదూ అన్నాను!.
కూడలికి రావడం తప్ప వేరేవేవీ సక్రమంగా చెయ్యడం లేదనిపిస్తుంది. :(
రోజూ కూడలికి వస్తున్నాను ..అన్నీ చదవడానికే కుదరడం లేదు!
ఇంక వ్రాయడం ఎప్పుడు కుదురుతుంది అని కొంతమంది వ్రాసిన టపాలు చూసి ఆహా .. మనలాంటివాళ్ళు ఇంకా ఉన్నారు.. నేను వ్రాయకపోవడానికి కూడా అది కారణమే అని సరిపెట్టుకున్నాను.
ఏంటో ఇలాంటి సాకులేవైనా ఉంటే నాకు అనుకూలంగా ఉండేలా భలే వాడుకుంటాను.

"నేను ప్రతి పొద్దు .. తెవికీ తో పాటు తేనెగూడు , ఇంకా తెలుగుబ్లాగర్స్.కాం చూస్తాను." అని ప్రతిజ్ఞ చేశాను!.


తెవికీలో వ్యాసాలకు మార్పులు, చేర్పులు చెయ్యమని తెలుగుపీపుల్.కాం లో చెప్పడం తప్ప నేను చేసిందేమీ లేదు :(
నాకెందుకో తెవికీకి వెళ్ళి మరీ ఎక్కువ కాకపోయినా కొంతవరకైనా పూతరేక్స్ నవీన్ ని అనుసరిస్తే బావుంటుందేమో అనిపిస్తుంది.

ఈ వ్యాసం వ్రాయడానికి గల ముఖ్యోద్దేశ్యం కూడా అదే...
నవీన్ గారూ ..(గారెలు పెట్టానని ఏమనుకోకుండా ) మీ సలహా /అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఒకవేళ అక్కడ కూడా ఆరంభశూరత్వం ప్రదర్శించినా కనీసం రెండు, మూడు మార్పులు ,చేర్పులైనా చేస్తానేమో అనిపిస్తుంది.
గ్రుడ్డికంటే మెల్ల నయమని .. అసలు వ్రాయకుండా ఉండేకంటే అక్కడ రెండో , మూడో వ్రాస్తే మంచిదేమోనని ..అంతే.. అంతే.. అంతే.. :)

Thursday, June 7, 2007

శాచూ రాసి

ఆ రోజు ఆదివారం .. ఇంట్లోనే ఉన్నా .. బోర్ కొడుతుంటే , ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
ఏదైనా సినిమా గానీ , కామెడీ క్లిప్స్ గానీ చూద్దామని ఒక సైట్ ఓపెన్ చేశా.
అక్కడ అన్నీ చూసేసినవే కనిపించాయి .. మళ్ళీ చూడడానికి ఆసక్తి కలగలేదు.

ఇంతలో వేరే లంకె మీద కొడితే ఒక వీడియో కనిపించింది.
సడన్ గా అంతకుముందు ఏదో వెబ్ సైటులో చదివిన ఒక అంశం గుర్తొచ్చింది.
విమర్శకులంతా దాన్ని చాలా మెచ్చుకున్నారని దాని సారాంశం.
సరే అంతగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అదేదో చూద్దాం అని క్లిక్ చేసి వీడియో ప్లే అవుతుంటే చూస్తున్నాను.

బాగానే ఆసక్తికరంగా అనిపించింది.
అది చూస్తూ అసలు ఏమయ్యుంటుందని ఊహిస్తూ మొత్తానికి మొదటిభాగం పూర్తి చేసా.
నేను ఊహించింది కరక్టో కాదో రెండోభాగంలో తేలుతుంది కదా ..
సరే రెండో భాగం చూద్దామని మొదలు పెట్టా.

మొదటి భాగానికి భిన్నమైన ఊహలతో రెండో భాగం ముగిసింది.
నిజం చెప్పొద్దూ !!.. నాకు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

సరే మొత్తం చూడడం అయిపోయింది ..
అసలు ఏమై ఉంటుందా అని దానిగురించి ఆలోచిస్తూ మొత్తం నెమరు వేసుకున్నా.
ఎంత ఆలోచించినా నా ఊహలు , ఆలోచనలు ఒక కొలిక్కిరావడం లేదు !.

అదేంటో..!! నాకు ఏదైనా అర్ధం కాకపోతే నాకు అదేంటో తెలుసుకోవాలన్న కోరిక ఇంకా బలపడుతుంది.

తర్వాత వారం మొత్తం కొంచెం పని ఎక్కువ ఉండి దానితోనే సరిపోయింది.

మళ్ళీ వీకెండ్ వచ్చింది ...
నాకు గత పదేళ్ళుగా తెలిసిన స్నేహితుడు వచ్చాడు ..

మాటల సందర్భంగా నేను చూసిన చిత్రం గురించి కూడా చెప్పాను.
సరే.. దాని సంగతి చూద్దాం పదరా.. అన్నాడు.

ఈసారి ఇద్దరం చూశాం ..
అదేంటో! ఈసారి వేరేగా ఊహించాను ..కొన్ని సీన్లు మాత్రం కామన్ (ఇంతకుముందు ఆలోచించినట్టుగానే ) ఊహలతో ముగిశాయి.
మొత్తం చూడడం అయిన తర్వాత నా స్నేహితుడ్ని ..
"ఏరా సతీష్ ఎలా ఉంది సినిమా " అని అడిగా .
దానికి వాడు .. చాలా బావుందిరా తప్పకుండా మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి చూడమని చెబుదాం అన్నాడు.


అది సరే రా ..నీకు ఏం అర్ధమైందో చెప్పరా బాబూ ..
ఈ సస్పెన్స్ తట్టుకోవడం నావల్ల కావట్లేదు అన్నాను.
"నువ్వు భలేవాడివే ! అది నాకు అర్ధమైతే అందరికీ చూడమని చెబుదామని ఎందుకు అంటాను ? "
మనవాళ్ళు అంతా చూసిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి ఎవరికైనా అర్ధం అయితే అదేంటో తెలుసుకోవాలని నా ప్లాన్ అన్నాడు !!.

అవునా .. అయితే నీకు కూడా అర్ధం కాలేదన్న మాట ! అన్నాను.

ఇంక వాడు మొదలుపెట్టాడు...
ఆ సినిమా ఏంటో , అది విమర్శకులకు అంతగా నచ్చడమేంటో నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావట్లేదు !.

మనం వాళ్ళ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో !! ..
అసలు ఏ కోణంలో ఆలోచిస్తే వాళ్ళకు అర్ధమయిందో ..
దర్శకుడు వాళ్ళకు ముందే కాన్సెప్ట్ చెప్పాడంటావా ?
లేక వాళ్ళంతట వాళ్ళే అర్ధం చేసేసుకున్నారంటావా ??

విమర్శకులంటే వాళ్ళు వేరు ..
వాళ్ళ ఆలోచనా విధానం సామాన్య వీక్షకుల ఆలోచనా విధానానికి భిన్నంగా ఉంటుందనేది జగద్విదితం.
వాళ్ళు చెప్పే పాయింట్స్ వాళ్ళనుంచి తెలుసుకున్న తర్వాత "అవును కదా .. నిజమే " అనిపిస్తాయి.

మరి ఈ సినిమా చూసిన చాలామంది ప్రముఖులు , హీరోలు కూడా చాలా బావుంది అన్నారు ..
వాళ్ళకు ఎలా అర్ధం అయిందో !!
నిజంగా అర్ధమయిందంటావా ? లేక అలా అర్ధమయిందని చెప్పి వాళ్ళు మేధావులు అనిపించుకోవాలని చూస్తున్నారంటావా ??


ఏంటోరా .. ఇంతకుముందు కూడా ఒక సినిమా చూశాను .. అది కూడా నాకు అర్ధం కాలేదు ..
దానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి.

అసలు ఎవరికీ అర్ధం కానివే విమర్శకులకు నచ్చుతాయా ??

ఎదగాలి .. మనం ఎదగాలి .. ఎప్పటికైనా ఆ సినిమాని అర్ధం చేసుకునే స్థాయికి ఎదగాలి.
అవునూ ... ఈ సినిమాలు కనీసం కొంతమందికైనా అర్ధమయ్యాయి కదా !.
మనం కనీసం ఒక్కరికి కూడా అర్ధం కాకుండా సినిమా తీద్దామా ??

సినిమా అంటే వెండితెర మీద సినిమా అని కాదు !
మామూలుగా హ్యాండీకాం తో షూట్ చేద్దాం .. మనవాళ్ళందరికీ చూపిద్దాం.
ఆ సినిమా , తీసిన మనకి కూడా అర్ధం కాకూడదు.
వేరేవాడికి కథ , కథనం అప్పగిద్దాం.
వాడు కథ చెప్తానని అన్నా మనం అస్సలు వినొద్దు.
వాడు తీసిన సినిమా ఎంతమందికి అర్ధం అవుతుందో చూద్దాం.
ఎవరికైనా అర్ధమయిందని తెలిస్తే అప్పుడు మనం కూడా మన రచయితను అడిగి తెలుసుకుందాం! ఏమంటావురా ? అన్నాడు.



"చూద్దాం .. నాకు ఆ అర్హత ఉందేమో అనిపిస్తుంది!.
ఎందుకంటే నేను ఏం రాసినా అర్ధం కాలేదని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు.
నువ్వు అనుకున్న విధంగా కథ రాసి నీకు దృశ్యం కనిపించేలా చెయ్యగలనేమో చూస్తా " ...
కానీ .. కానీ .. కానీ ..
నాకు ఒకటే డౌట్ ..
అందరూ దాన్ని చూసిన తర్వాత నిన్ను చూసి జాలిపడతారేమో ! అన్నాను.

ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత మాకు బ్యాక్ గ్రౌండ్ లో .....................

" కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ .." అని పాట వినిపిస్తుంది.

అవును! ఓడిపోలేదు .. నేను ఓడిపోలేదు!! అంటూ నవ్వాడు వాడు !!.


Wednesday, May 30, 2007

అదే నీవు..

నా స్నేహితుడు ఒకడు ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
మొన్నామధ్య కలిసినప్పుడు కాసేపు ముచ్చటలు అయిన తర్వాత వాడూ , ఇంకొక స్నేహితుడు టెక్నాలజీ గురించీ , వాళ్ళ వాళ్ళ కంపెనీలలో పని చేసే విధానాల గురించీ మాట్లాడుకుంటున్నారు.
వారమంతా ఈ ఆఫీసు గోల ఎలానూ తప్పదు ! , ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారేమిట్రాబాబూ అనుకుంటూ నేను అంతగా ఆసక్తి చూపనట్టుపక్కనే కూర్చున్నాను.

వాళ్ళ మాటల మధ్యలో టీం మెంబర్స్ రిపోర్ట్ చేసేదానిగురించి వచ్చిన టాపిక్ నా దృష్టిని ఆకర్షించింది.

వాడు వేరే ఫ్రెండ్ తో అంటున్నాడు ..

" మా టీం లో ఇద్దరున్నారురా .. వాళ్ళిద్దరూ పని బాగానే చేస్తారు కానీ సరిగా ప్రెజెంట్ చేసుకోవడం రాదు.ఏదైనా వాళ్ళంతట వాళ్ళు వచ్చి " పని అవుతుంది , పూర్తి చేసాను ,.. ఇలా చేశాను .. అలా చేశాను ..లేదా ఇలా చేస్తే బావుంటుందనుకుంటున్నాను మీరేమంటారు ? "లాంటి విషయాలేవీ మాట్లాడరు.

డెలివర్ చెయ్యాల్సిన రోజు ఎలానూ అడుగుతాను కాబట్టి అయిపోయిందనో .. ఇంకొక గంటలో అయిపోతుందనో చెప్తారు.లేదా ఇక్కడ ప్రోబ్లం ఉంది అని చెప్పి అది డిస్కస్ చేసి దాని ప్రకారం పని పూర్తి చేసి ఇస్తారు. కొన్నిసార్లు డెలివరీ డేట్ కంటే ముందు ఏదైనా అవసరమయ్యి వేరే పని ఇవ్వాల్సివచ్చినప్పుడు వెళ్ళి వర్క్ స్టేటస్ అడిగితే ఆ రోజు సాయంత్రానికల్లా పని పూర్తి చేసి ఇస్తారు.వాళ్ళు ముందే ఆ పనులు పూర్తి చేసి కాలం గడుపుతున్నారో లేక అడిగినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారో నాకైతే అర్ధం కావట్లేదు !

వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళ అప్రైజల్ టైం లో ఉపయోగపడుతుంది ... అది సరిగా చేసుకోకపోతే వాళ్ళకే నష్టం .. కానీ వాళ్ళ సామర్ధ్యం నాకు తెలుసు కాబట్టి మంచి రేటింగే ఇస్తున్నాను.
"ప్రాజెక్ట్ మేనేజర్ అంటూ ఒకడు ఉన్నాడు , వాడికి స్టేటస్ తెలియజేద్దాం అనే ఆలోచనే ఉండదు వాళ్ళకు ! . "
వాళ్ళు అలా చేస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది !.
పోనీ స్ట్రిక్ట్ రూల్స్ పెడదామా అంటే ఇప్పటివరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించి వాళ్ళు అలా చెయ్యడానికి నేనూ కొంతవరకు కారణమే అనిపించీ , .... ఇంకా .... ఫ్రెండ్లీగా ఉంటాడు .. పని చేసి ఇస్తే చాలు వేరేవి పట్టించుకోడు అనుకుంటుంటే ఇప్పుడు సడన్ గా ఛండశాసనుడిలా మారిపోయాడు అనుకుంటారేమో ఎందుకులే అని కొంతా ఆలోచించి, .. ఎలానూ టైం కి పని చేస్తున్నారుగా అని ఇంక ఏమీ అనలేకపోతున్నాను."


----
వాడి మాటలు విన్న నాకు మన తెలుగు సినిమాలో కళ్ళ ముందు రీల్ తిరిగినట్టు గతం గుర్తొచ్చింది !
వాడు , నేను , ఇంకొక ముగ్గురు కాలేజ్ లో ఫైనల్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ చేశాం.

మా ప్రాజెక్ట్ గైడ్ చాలా మంచివాడు ..మా అందరిమీదా మంచి అభిప్రాయమే ఉండేది .. సంవత్సరం మొదట్లో ప్రాజెక్ట్ గైడ్ గా ఆయన్ని మాకు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాము.మేము చేసింది ఐ.టి రిలేటెడ్ ప్రాజెక్ట్ .. మా గైడ్ ఏదో సహాయం చేసేస్తాడని కాదుగానీ .. మంచి గైడ్ ..ఎప్పుడూ కూడా తిప్పుకుని ఇబ్బంది పెట్టడు .. అది చాలు కొంచెం ప్రశాంతంగా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యొచ్చు అనుకున్నాం.

సరే ..మొదట్లో ఆయన్ని కలిసాం .. ప్రాజెక్ట్ గురించిన వివరాలన్నీ ఇచ్చాం .. అయిపోయింది.తర్వాత మమ్మల్ని ప్రాజెక్ట్ స్టేటస్ గురించి ఆయనా అడగిందీ లేదు .. మేము వెళ్ళి ఆయన్ని కలిసి స్టేటస్ చెప్పిందీ లేదు ..

రోజులు , వారాలు , నెలలూ గడిచిపోయాయి. అలా ఆరు నెలలు గడిచిపోయాయి .వేరే వాళ్ళందరూ వాళ్ళ గైడ్ తో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ సంబంధిత విషయాలు తెలియజేస్తున్నారు. మేము మాత్రం మా గైడ్ ని కనీసం కలవనుకూడా కలవలేదు.కొన్నాళ్ళకు కనిపిస్తే ఎక్కడ ఏం అడుగుతాడో అని తప్పించుకుని తిరిగే పరిస్థితి వచ్చేసింది.

ఒక రోజు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాం .. ఆరోజు మా గైడ్ కూడా క్రికెట్ ఆడడానికి వచ్చారు .. మ్యాచ్ అయిపోయిన తర్వాత నన్ను పట్టుకుని "అసలు మీరు ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నారా లేదా ? ఎప్పుడో సంవత్సరం మొదట్లో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నారు .. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు దానిగురించి ఏమీ చెప్పలేదు .. వారంలోగా మీరు చేసినదంతా చూపించకపోతే మీ అందరికీ సున్నా వేస్తాను " అని పెద్ద క్లాస్ పీకాడు.

నేను వెళ్ళి టీం లో అందరికీ చెప్పాను ... దొరికేసానురా .. గ్రౌండ్ లో పట్టుకుని తిత్తి తీశాడు. వారం రోజుల్లో ఏదొకటి చూపించకపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పాను.నేనూ , సునీల్ కష్టపడి ఒక 5,6 పేజీలు డిజైన్ చేసాం (కోడ్ రాసాం గానీ సరిగా టెస్ట్ చేస్తే చాలా తప్పులు కనిపిస్తాయి ). ఎలానూ ఆయన పక్కన కూర్చుని అంతా టెస్ట్ చెయ్యడన్న నమ్మకంతో వెళ్ళి మొత్తం ప్రెజెంటేషన్ చూపించి మొత్తానికి గైడ్ ని ప్రసన్నం చేసుకున్నాం.ఇంక అప్పటినుంచీ వారం వారం కనిపిస్తూ చేసిన పని చూపించేవాళ్ళం.మొత్తానికి ఫుల్ మార్కులు వేయించుకున్నాం.

ఇదంతా గుర్తు వచ్చి నాలో నేనే నవ్వుకుంటున్నాను .

ఇంతలో వాడు నా వైపు చూసి ఏంట్రా .. నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నాడు.

ఫైనల్ ఇయర్ లో మేము చేసిన ప్రాజెక్ట్ గురించి గుర్తు చేసి..అప్పుడు మన ఆలోచనలు కేవలం " అడిగినప్పుడు చేసిన పని చూపిస్తే చాలులే " అన్నట్టు ఉండేవి .. అంటే నీకు రిపోర్ట్ చేసే టీం మెంబర్స్ లా అన్న మాట.
ఇప్పుడు నీకు మన గైడ్ పరిస్థితే ఎదురయ్యింది అనిపించింది... అందుకే నవ్వు వస్తుంది.

విద్యార్థిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరు .. ఇప్పుడు నువ్వు మేనేజర్ అయ్యావు కాబట్టి నువ్వు ఆలోచించే విధానం వేరు.
'కనీసం కలిసి స్టేటస్ కూడా చెప్పరు వీళ్ళు 'అనే మన గైడ్ కూడా అనుకుని చిరాకుతో క్లాస్ పీకి మంచివాడు కాస్తా చావగొడుతున్నాడు కదరా అనుకునేలా చేశాడు.
మనం కప్పదాటు వ్యవహారంలా కాకుండా .. అప్పుడప్పుడూ కలిసి స్టేటస్ చెప్తూ ఉండుంటే మనకి ఏ ప్రోబ్లం ఉండేది కాదు !.మనం అలా చెయ్యలేదు కాబట్టే ఆయన కూడా ఇప్పుడు నువ్వు ఫీలైన విధంగానే అనుకుని ఉంటాడు.
" గైడ్ అనేవాడు ఒకడున్నాడు ..వాడిని అప్పుడప్పుడూ కలిసి స్టేటస్ చెప్తుండాలనే ఆలోచనే ఉండదు వీళ్ళకి .. నన్ను అసలు లెక్క చెయ్యట్లేదు " అనుకుని ఉంటాడు .
అందుకే ఇంక లాభం లేదని మనకి ఆ వారం రోజులూ సినిమా చూపించాడు అన్నాను .
విషయం అర్ధమయ్యింది కదా .. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించు అన్నాను.

ఒకప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఆలోచిస్తే వేరేలా అనిపిస్తున్నాయి .. వయసు , హోదా పెరిగేకొద్దీ ఇంకా ఇలాంటివి ఎన్ని తెలుసుకుంటామో కదా అని ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం :)

Thursday, May 24, 2007

నివేదిక

స్కూల్ లో క్లాస్ జరుగుతుంటుంది .. స్కూల్ తనిఖీ ( Inspection ) చెయ్యడం కోసం ఒక పెద్దాయన స్కూల్ కి వస్తారు.

ఒక తరగతి గదికి వెళ్తారు .. అక్కడ టీచర్ ఏదో పాఠం చెప్తూ ఉంటారు.తనిఖీ చెయ్యడం కోసం వచ్చిన పెద్దాయన ఆ తరగతిలోని ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడుగుతారు.
తనిఖీ అధికారి : బాబూ నువ్వు లేచి నిలబడు !విద్యార్థి లేచి నిలబడతాడు.
తనిఖీ అధికారి : రామాయణం ఎవరయ్యా రాసింది ?
విద్యార్థి : నాకు తెలియదు సార్ , నేనైతే రాయలేదు !!.
తనిఖీ అధికారి ఎవరో ఒకర్ని ప్రత్యేకించి అడగడం దేనికని .. విద్యార్థులనందరినీ ఉద్దేశ్యించి ...' రామాయణం ఎవరు రాసారో మీలో ఎవరైనా చెప్తారా ' అని అడుగుతారు.
విద్యార్థులెవ్వరూ సమాధానం చెప్పరు .. అంతా మౌనంగా ఉంటారు.అప్పుడు ఆ అధికారి ఉపాధ్యాయులవారిని అడుగుతారు ..
'ఏంటి మాస్టారు .. రామాయణం ఎవరు రాశారంటే ఎవరూ చెప్పట్లేదు '
దానికి ఆ ఉపాధ్యాయుని సమాధానం :
'ఏమో సార్ ..ఎవరు రాశారో నేను చూడలేదు '.
ఆ సమాధానం విన్న అధికారికి చిర్రెత్తుకొస్తుంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని పిలిచి జరిగినదంతా చెప్తారు.
దానికి ఆ హెడ్ మాస్టర్ గారు ::
'అయ్యో మీతో అలా చెప్పారా !! .. ఐతే మీకు అబద్దం చెప్పారు !!(ఒక కుర్రాడిని చూపిస్తూ ) ఆ రామాయణం రాసింది ఈ కుర్రాడే .. అది చెప్పింది మా మాస్టారే .. ఆయన చెప్తుండగా వీడు రాయడం నేను కళ్ళారా చూశానండి '.
తనిఖీ అధికారి కోపం తారాస్థాయికి చేరుతుంది .. ఆ పాఠశాల నుంచి వెంటనే తిరుగు ప్రయాణం కట్టేస్తారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు కోపం చల్లారదు. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత పై అధికారికి ఆ స్కూల్ లో జరిగిన Inspection తతంగమంతా సవివరముగా వివరిస్తూ ఒక నివేదిక తయారు చేస్తారు.
పాఠశాలకు వెళ్ళి ఒక విద్యార్థిని లేపి 'రామాయణం ఎవర్రాశారయ్యా ' అని అడిగితే వాడేమో 'నాకు తెలియదు సార్ , నేనైతే రాయలేదు.' అన్నాడు , ఉపాధ్యాయుణ్ణి అడిగితే 'ఏమో సార్ ..ఎవరు రాశారో నేను చూడలేదు ' అన్నాడు , సరే అని ప్రధానోపాధ్యాయులవారిని పిలిచి ఇదంతా చెప్తే దానికి ఆయన ..
'అయ్యో మీతో అలా చెప్పారా ! .. ఐతే మీకు అబద్దం చెప్పారు !!
ఆ రామాయణం రాసింది ఈ కుర్రాడే .. అది చెప్పింది మా మాస్టారే .. ఆయన చెప్తుండగా వీడు రాయడం నేను కళ్ళారా చూశానండీ ' అన్నాడు.
.............................................
.............................................
.............................................
.............................................

(నివేదిక చివర్లో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తనిఖీ అధికారి చేసిన సూచన ఇలా ఉంది.)

ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు గానీ , పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి గానీ , ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గానీ ఎవ్వరికి ..రామాయణం రాసింది రాముడనీ , మహాభారతం రాసింది భీముడనీ తెలియదు !!!.
ఇలాంటి సిబ్బంది ఉండడం వల్లనే మన విద్యావ్యవస్థ ఇలా తయారయింది.వీలైనంత త్వరలో ఆ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
------------------------------------------------------------------------------------------------

ఇది కిందటి సంవత్సరం స్నేహితుల ఇంటికి వెళ్తే అక్కడ మాటల సందర్భంగా బాగా పేలిన జోకు.బహుశా ఇది చాలామందికి తెలుసేమో .. నాకు మాత్రం కొత్త.
ఇది నా మొదటి వ్యాసం .. ఈసారి ఇంకా ఆసక్తికరంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను :)